New Development Works started at Yadagirigutta | యాదగిరిగుట్ట లో నూతన అభివృద్ది పనులకు శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్యక్షేత్ర అభివృద్ధిలో భాగంగా, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో యాదగిరిగుట్ట కొండపైన నూతన కళ్యాణ మండపం, రాయగిరి గ్రామం వద్ద శ్రీ స్వామివారి దివ్య స్వాగత తోరణం (ఆర్చ్ గేట్) నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ రెండు ప్రతిష్ఠాత్మక నిర్మాణాలను దేవస్థాన చైర్మన్ శ్రీ మన్నె సత్యనారాయణరెడ్డి దాతగా తన స్వంత ఖర్చులతో నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా కొండపైన నూతన కళ్యాణ మండప నిర్మాణానికి రూ.9.87 కోట్లను, రాయగిరి గ్రామం వద్ద స్వాగత తోరణం నిర్మాణానికి రూ.3.16 కోట్లను వెచ్చించనున్నారు. ఈ రెండు నిర్మాణాలకు కలిపి మొత్తం రూ.13.03 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు.

నూతన కళ్యాణ మండపం ప్రత్యేకతలు

యాదగిరిగుట్ట కొండపైన సుమారు 21,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రధాన హాల్ సుమారు 12,650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, ఒకేసారి సుమారు 1,500 మంది భక్తులు కూర్చునే విధంగా విశాలమైన ఏర్పాట్లు చేయనున్నారు.

కళ్యాణోత్సవాల నిర్వహణకు అనువుగా విశాలమైన ప్రత్యేక వేదిక (స్టేజ్), వేదికకు ఇరువైపులా రెండు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయనున్నారు. వృద్ధ భక్తుల సౌకర్యార్థం హాల్ లోపల ప్రత్యేక సీటింగ్ సదుపాయం కల్పించనున్నారు.

అలాగే భక్తుల సౌకర్యార్థం నాలుగు లిఫ్టులు, భక్తులకు మరియు అర్చకులకు వేర్వేరుగా అత్యాధునిక టాయిలెట్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. పూర్తిస్థాయి ఏసీ సదుపాయంతో పాటు నాణ్యమైన ఆడియో సిస్టమ్, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు తదితర ఆధునిక సాంకేతిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ నిర్మాణం పూర్తయిన అనంతరం స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలను మరింత విశాలమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుంది.

రాయగిరి వద్ద శ్రీ స్వామివారి దివ్య స్వాగత తోరణం

యాదగిరిగుట్ట దేవస్థానం యొక్క ఆధ్యాత్మిక వైభవం, ప్రాశస్త్యం ప్రతిబింబించేలా రాయగిరి గ్రామం వద్ద సుమారు రూ.3.16 కోట్ల వ్యయంతో శ్రీ స్వామివారి స్వాగత తోరణం (ఆర్చ్ గేట్) నిర్మించనున్నారు.

ఈ స్వాగత తోరణాన్ని శ్రీ స్వామివారు, అమ్మవారు మరియు వివిధ దేవతామూర్తుల ప్రతిరూపాలతో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా రూపకల్పన చేయనున్నారు. ఈ తోరణం ద్వారా యాదగిరిగుట్ట క్షేత్రానికి విచ్చేసే భక్తులకు క్షేత్ర ప్రవేశం నుంచే దైవికమైన, ఆధ్యాత్మికమైన అనుభూతి కలిగే విధంగా నిర్మాణం చేపట్టనున్నారు. దేవస్థాన కళాత్మక వైభవం, సాంప్రదాయ శిల్పకళా సౌందర్యం ప్రతిబింబించేలా ఈ స్వాగత తోరణాన్ని తీర్చిదిద్దనున్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

కొండపైన నూతన కళ్యాణ మండప నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో  ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య , యాదగిరిగుట్ట దేవస్థాన చైర్మన్ శ్రీ మన్నె సత్యనారాయణరెడ్డి  పాల్గొని శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే శ్రీ గడ్డం వినోద్ , శ్రీ టి. విజయేందర్ గౌడ్ , శ్రీ లక్ష్మీనారాయణ , శ్రీమతి ఈశ్వరమ్మ , శ్రీ గుండు మల్లయ్య , జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి , దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ జె. భవానీ శంకర్ , యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వాణి భరత్ గౌడ్ , రెవెన్యూ డివిజనల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా రాయగిరి గ్రామం వద్ద స్వాగత తోరణం నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య , దేవస్థాన చైర్మన్ శ్రీ మన్నె సత్యనారాయణరెడ్డి  పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే శ్రీ గడ్డం వినోద్ , శ్రీ టి. విజయేందర్ గౌడ్ , శ్రీ లక్ష్మీనారాయణ , శ్రీమతి ఈశ్వరమ్మ , శ్రీ గుండు మల్లయ్య , దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ జె. భవానీ శంకర్ , భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి శ్రీవాణి రవికుమార్  తదితరులు పాల్గొన్నారు.

ఈ రెండు నిర్మాణాలు పూర్తయితే యాదగిరిగుట్ట క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభ చేకూరడంతో పాటు, భక్తులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. దాతల సహకారంతో దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కానున్నాయి.

Comments