యాదగిరిగుట్ట లో శాశ్వత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనం వచ్చేనా?
40 ఏళ్లుగా అద్దె భవనంలోనే
ఆదాయం ఉన్న సదుపాయాలు కరువు
గతంలోనే శంకుస్థాపన
![]() |
| ఊహాచిత్రం | |
యాదాద్రి యాదగిరిగుట్ట లో తిష్ట వేసిన పలు సమస్యలలో ఒకటి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. 1983 లో అంటే, దాదాపు 41 సంవత్సరాలు గడిచిన దీనికి ఒక శాశ్వత భవనం లేదు, ఆనాడు గాంధీనగర్ లోని ఒక అద్దె భవనంలో మొదలైన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అటు తరువాయి నల్ల పోచమ్మ వాడ లోని మరో అద్దె భవనంలోకి మారింది. తాజాగా ఇప్పుడు యాదగిరిపల్లి లోని మరో అద్దె భవనంలో కొనసాగుతుంది.
గత 20 ఏళ్లలో విపరీతంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పెరగడం, ముఖ్యంగా యాదాద్రి పునర్నిర్మాణం, హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ ప్రకటనలు రావడంతో ఇక్కడి రిజిస్ట్రేషన్ లు గతంలో విపరీతంగా పెరిగాయి. రాష్ట్రం లోనే మంచి ఆదాయమున్న కార్యాలయంగా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పేరుగాంచింది. అయితే వచ్చే పౌరులకు తగిన సదుపాయాలు కరువైనాయి. అద్దె భవనాల్లో, గృహ వినియోగం కోసం నిర్మించిన భవనాల్లో కార్యాలయాలు పెట్టడంతో తగిన సదుపాయాలు పౌరులకు కల్పించలేకపోయారు, ముఖ్యంగా వచ్చే పౌరులు తమ నెంబర్ వచ్చే వరకు వేచి ఉండడానికి తగిన వసతి లేకపోవడం, స్త్రీ పురుషులకు తగిన టాయిలెట్లు లేక పోవడం వగైరా ఇబ్బందులు పౌరులకు ఎదురవతున్నాయి.
గత ప్రభుత్వంలో యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయనికి శాశ్వత భవన నిర్మాణానికి యాదగిరిపల్లి చెరువు దగ్గర శంకుస్థాపన చేశారు. కానీ ఆ స్థలం అంతా యాదాద్రి రింగ్ రోడ్డు నిర్మాణంలో కలిసిపోవడం తో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. గతంలో చాలా మంది రియల్టర్ లు తమ వెంచర్లలో భవన నిర్మాణానికి ఉచిత స్థలం ఇస్తామని ముందుకు వచ్చిన ప్రభుత్వం నుంచి సరి అయిన స్పందన లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుత ప్రజపాలన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. వీటిని కార్పొరేట్ సామాజిక బాద్యత (CSR) నిధులతో నిర్మించాలని అనుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 114 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో 37 కార్యాలయాలకు మాత్రమే స్వంత భవనాలు ఉన్నాయని మిగతా వాటికి లేవు అని తేలింది. అందులో యాదగిరిగుట్ట కార్యాలయం ఒకటి. ప్రభుత్వ ఆలోచన ప్రకారం విశాలమైన స్థలంలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు గంటల తరబడి చెట్ల కింద వేచి ఉండకుండా ఆయా భవనాల్లోనే అన్నీ రకాల వసతులతో కార్పొరేట్ స్తాయిలో ఈ భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఆయా జిల్లా కలెక్టర్ లకు అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశాలిచ్చారు. మొదటగా ఒక మోడల్ కార్యాలయం హైదరాబాద్ లో నిర్మించుటకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు.
ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించిన ఈ తరుణంలో, ఇప్పటికైన స్థానిక అధికారులు, నాయకులు స్పందించి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి యాదగిరిగుట్ట లో ఒక శాశ్వత భవనం అందరికీ అందుబాటులో ఉండే అనువైన ప్రదేశంలో నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
#yadadri #yadagirigutta #SROYadagirigutta Yadagirigutta Sub Registrar Office
No comments:
Post a Comment
Please visit again to this site, will be replied your comment shortly