Yadagirigutta Temple Got 54 New Employees | యాదగిరిగుట్ట ఆలయంలోకి నూతన సిబ్బంది నియమాకం

  • దేవాదాయ శాఖలో చారిత్రాత్మక నియామకాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 191 పోస్టులకు నియామక పత్రాల ప్రదానం
  • యాదగిరిగుట్ట ఆలయమునకు  54 పోస్టుల నియామకం 

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా 191 పోస్టులను భర్తీ చేస్తూ నియామక పత్రాలను అందజేసింది. రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ,  దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ ఎం. హనుమంతరావు ప్రత్యేక చొరవతో నియామక ప్రక్రియను పూర్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేసిన 191 పోస్టుల్లో యాదగిరిగుట్ట  దేవస్థానము లో 54 పోస్టులు నియామకం కాబడిన వారికీ నియామక పత్రాలు అందజేయనైనది.  అట్టి పోస్టుల వివరాలు 

  1. పరిచారకులు ( ప్రధాన ఆలయం ) -19, 
  2. పరిచారిక (శివాలయం )- 5 , 
  3. వేదపండిత్ ( అథర్వణ వేదం ) -1, 
  4. పురోహిత్ (వాహన పూజలు) -1, 
  5. సహాయా పాచక (రామానుజకుటం) - 11 , 
  6. సహాయ పాచక (బ్రాహ్మణ సత్రం) -2, 
  7. సహాయ పాచక (ప్రసాద విక్రయం) - 6 ,
  8. సహాయ పాచక (అన్నదానం) - 4, 
  9. డోలు -1, 
  10. సన్నాయి -2, 
  11. శృతి -1, 
  12. తాళం -1,  

దాదాపు 14 సంవత్సరాల తరువాత దేవాదాయ ధర్మాదాయ శాఖలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టడం విశేషం. ఆలయాల్లో నెలకొన్న సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు అర్చక వ్యవస్థను బలోపేతం చేయడం, సాంప్రదాయ వాద్య కళాకారులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు యాదగిరిగుట్ట  దేవస్థానం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, భోజన వసతి సహా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించింది. 

హిందూ దేవాలయాల అభివృద్ధి, ధార్మిక సేవల విస్తరణ, ఆలయ సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడే ఈ 191 నియామకాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

Comments