High Court Issues Notices to Yadagirigutta Trust Board | యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను పరిశీలించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈ వ్యవహారంపై తమ కౌంటర్ అఫిడవిట్‌లను (సమాధానాలను) దాఖలు చేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్, దేవస్తాన ఈవో తో  పాటు బోర్డు సభ్యులకు కూడా నోటిసులు జారీ అయినట్టు తెలుస్తుంది. 

పిటిషన్‌లో తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం–1987లోని సెక్షన్ 96, 97లను 2025 సవరణ చట్టం (చట్టం నెం.11) ద్వారా చేసిన మార్పులతో పాటు, 2026 జూన్ 30న జారీ చేసిన జి.ఓ.ఆర్‌.టి. నెం.392 ద్వారా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేశారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది మయూర్ ముండ్రా వాదిస్తూ, తాజా సవరణల కారణంగా వ్యవస్థాపక ధర్మకర్త (Founder Trustee) హోదాను కేవలం సాధారణ ట్రస్ట్ బోర్డు సభ్యుని స్థాయికి పరిమితం చేశారని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్ట సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే, ఈ సవరణలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 25, 26లకు విరుద్ధంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ బోర్డులకు ఆలయ మతపరమైన వ్యవహారాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలయ పరిపాలనపై నియంత్రణ కల్పించేలా ఈ నిబంధనలు ఉన్నాయని, దీనివల్ల హిందూ మత సంస్థలకు ఉన్న స్వయం ప్రతిపత్తికి భంగం కలుగుతోందని పిటిషనర్ వాదించారు. అంతేకాకుండా, వ్యవస్థాపక ధర్మకర్తలకు చట్టపరంగా కల్పించిన ప్రత్యేక హోదా, అధికారాలను ఈ సవరణలు బలహీనపరుస్తున్నాయని పేర్కొన్నారు.

అలాగే, జి.ఓ.ఆర్‌.టి. నెం.392 ప్రకారం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌ను నియమించే సమయంలో వ్యవస్థాపక ధర్మకర్తకు చట్టబద్ధంగా ఉన్న హోదా, హక్కులను పరిగణనలోకి తీసుకోలేదని కూడా పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, తమ సమాధానాలను కౌంటర్ అఫిడవిట్‌ల రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను అనంతర తేదీకి వాయిదా వేసింది.

#yadagirigutta #yadadri #ytda #ytd  yadagirigutta trust board court case

Comments