Meeseva Transctions New Record in One day | ఒక్క రోజులో 2.20 లక్షల లావాదేవీలతో మీ సేవ కొత్త రికార్డు

  • ఒక్క రోజులో 2.20 లక్షల లావాదేవీలతో మీ సేవ చరిత్ర సృష్టించింది
  • ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • దేశంలోనే నంబర్-1 ప్రభుత్వ డిజిటల్ సేవా వేదికగా మీ సేవ

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక డిజిటల్ పౌర సేవా వేదిక మీ సేవ (MeeSeva) మరో కీలక మైలురాయిని అధిగమించింది. జూలై 31, 2026 (శుక్రవారం) ఒక్క రోజులోనే 2,20,172 లావాదేవీలు నమోదై, మీ సేవ చరిత్రలోనే అత్యధిక రోజువారీ లావాదేవీల రికార్డు నమోదైనట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మీ సేవ వేదికను నిరంతరం బలోపేతం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించడం, వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, మరిన్ని శాఖల సేవలను సమీకరించడం వంటి చర్యల ఫలితంగానే ఈ అరుదైన విజయాన్ని సాధించగలిగామని చెప్పారు.

సాధారణంగా రోజుకు 70 వేల నుంచి 80 వేల వరకు లావాదేవీలు నమోదయ్యే మీ సేవలో, ఒక్క రోజులోనే 2.20 లక్షలకు పైగా లావాదేవీలు జరగడం రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ డిజిటల్ పాలనపై ఉంచుతున్న విశ్వాసానికి నిదర్శనమని మంత్రి తెలిపారు.

రికార్డు స్థాయిలో నమోదైన లావాదేవీల్లో ఫ్యామిలీ కార్డు దరఖాస్తులు, రవాణా శాఖ సేవలు, ఆదాయ ధృవీకరణ పత్రాల (ఇన్‌కమ్ సర్టిఫికెట్) దరఖాస్తులు అత్యధికంగా వినియోగించిన సేవలుగా నిలిచాయని వెల్లడించారు.

ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు జరిగినప్పటికీ ఎలాంటి సాంకేతిక అంతరాయాలు లేకుండా సేవలు నిరంతరాయంగా అందించగలిగామని, దీంతో సామర్థ్యం, విశ్వసనీయత, ప్రజలకు నాణ్యమైన సేవల అందించడంలో దేశంలోనే అగ్రగామి ప్రభుత్వ డిజిటల్ సేవా వేదికగా మీ సేవ తన స్థానాన్ని మరింత బలపరుచుకుందని మంత్రి పేర్కొన్నారు.

ఈ విజయానికి కృషి చేసిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సాంకేతిక బృందాలకు మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు.

ప్రస్తుతం మీ సేవ ద్వారా ఫ్యామిలీ కార్డు దరఖాస్తులు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ సేవలు, ప్రభుత్వ మరియు యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, రవాణా శాఖ సేవలు సహా అనేక ప్రభుత్వ శాఖల సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని పౌరసేవలను మీ సేవలో చేర్చి, అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ సేవల వేగం, నాణ్యత, పారదర్శకత, సామర్థ్యాన్ని మరింత పెంచనున్నామని మంత్రి స్పష్టం చేశారు. డిజిటల్ పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలపాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

#meeseva #sridharbabu #esd #digitalseva

Comments